studio9focus
Spread the love

కోల్‌కతా: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర హామీకి కేంద్రం చట్టం తీసుకు రావాలని రైతు సంఘాలు చేపట్టిని ఉద్యమానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి భరోసా లభించింది. రైతు సంఘాల ఉద్యమానికి మద్దతు కొనసాగిస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చినట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మమతా బెనర్జీని తికాయిత్ కలుసుకున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, స్థానిక కార్మికుల అంశాలపై ఆమెతో చర్చించారు. అనంతరం మీడియాతో తికాయిత్ మాట్లాడుతూ, రైతుల ఉద్యమానికి మద్దతు కొనసాగిస్తామని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారని, ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. పశ్చిమబెంగాల్ మోడల్ స్టేట్‌గా నిలవాలని, రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.

దీనికి ముందు, మమతతో సమావేశం ఎజెండాను తికాయిత్ వివరిస్తూ, బెంగాల్ రైతులు కనీస మద్దతు ధర పొందడం లేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రిని కోరనున్నామని చెప్పారు. ఇప్పటికే మమతా బెనర్జీ లేఖ రాసి ఉంటే, మరోసారి కేంద్రానికి గుర్తుచేయాలని కోరుతామని తెలిపారు. సాగు చట్టాల రద్దు, ఎంఎస్‌పీకి భరసా ఇస్తూ చట్టం చేయాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత నవంబర్‌ నుంచి కొనసాగిస్తున్న ఆందోళనకు టీఎంసీ మొదట్నించి మద్దతు ఇస్తోంది. సరిహద్దుల్లో నిరసనలు సాగిస్తున్న రైతులను పలువురు టీఎంసీలు ఎంపీలు కలిసి సంఘీభావం కూడా తెలిపారు.

By Anvesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!